రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయకపోతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. సికింద్రాబాద్ వేదికగా మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్ బి స్టేడియంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసికి తీవ్ర నష్టం అని చెప్పారు. రాష్ట్రం కలిసుండాలా? విడిపోవాలా? నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదని, ప్రజలేనన్నారు. 50ఏళ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని ఇప్పుడు అర్థాంతరంగా వెళ్లమంటే ఎక్కడకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. సీడబ్లూసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాఅభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన పార్టీలకు మనుగడ ఉండదనే విషయం గతంలో ఎన్నో పరిణామాలు నిరూపించాయని ఆశోక్‌బాబు వివరించారు. సమ్మె ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 108 రోజులు సమ్మె చేశామని గుర్తు చేశారు. తాము ఢిల్లీ వెళ్లినప్పుడు ఎంపిలను ఎన్నో రకాలుగా వేడుకున్నట్లు తెలిపారు. ప్రజల అంగీకారంలేకుండా రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని కొన్ని జాతీయ పార్టీల నేతలు చెప్పారన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తిలేదన్నారు.