''క్రోనీ క్యాపిటలిజం..'' ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వచ్చిన పేరిది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీచేసే వ్యవస్థ ఇది. అంటే.. ఇటు అధికారంలో ఉన్నవారూ.. అటు బడాపెట్టుబడిదారులు ఏకమై.. జనం సొమ్మును దిగమింగే ప్రక్రియ అన్నమాట. మన రాష్ట్రంలో ఇది చేసిన దారుణం అంతా ఇంతా కాదు.. యావత్ భారతదేశాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కార్పొరేట్ సంస్థ రిలయన్స్.. కర్నూలు జిల్లాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రైతులకు చెప్పకుండా.. కనీసం సమాచారం లేకుండా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 వేల ఎకరాలను ఇక్కటి ప్రభుత్వం రాసిచ్చేసింది.. రిలయన్స్ జెండా పాతేసింది..!!
దొంగల్లా.. దోచుకున్నారు...
కర్నూల్ మండలం గార్గేయపురంలో కొందరు సన్నకారు, చిన్నకారు రైతులు తమ భూములను రెక్కల కష్టంతో సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. అలాంటి సమయంలో వారి చెవిన ఓ పిడుగులాంటి వార్త పడింది. అదేమిటంటే ''ఈ భూములు మీవి కావు.. మావి'' అంటూ.. రిలయన్స్ కంపెనీ పాగావేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 5 వేల ఎకరాల భూమిని రైతుల దగ్గరి నుంచి లాక్కుంది. కర్నూల్ మండలం గార్గేయ పురంలో ఓర్వాకల్ మండలం పుడిచర్ల , నాన్నుర్ , కేతవరం గ్రామాల్లోని 250 మంది రైతులకు చెందిన ఈ భూములు రిలయన్స్ గుప్పిట్లోకి వెళ్లాయి.
రైతులకు విషయమే తెలీదు...
చట్టాలు చేసే ప్రభుత్వ నేతలు.., వాటిని అమలు పరిచే అధికారులు.. ఇద్దరూ కలసి రైతుల్ని నిలువునా ముంచారు. ఎవరు ఓట్లు వేసి గెలిపించి గద్దెనెక్కించారో ఆ ప్రజల బతుకుల్నే బుగ్గి పాలు చేశారు. తమ ప్రజల బాగోగుల కంటే.. తమ పార్టీలను పోషించే కార్పొరేట్ గద్దల భోగభాగ్యాలే వారికి ముఖ్యమయ్యాయి. 5 వేల ఎకరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ కి ధారాదత్తం చేసింది.
సిమెంటు ఫ్యాక్టరీ.. ఉద్యోగాల పేరుతో...
సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని, రైతుల్ని ఆదుకుంటామని, ఉద్యోగాలు కల్పిస్తామని ఏవేవో మాయ మాటలు చెప్పి ప్రభుత్వంతో రిలయన్స్ కంపెనీ జీ.వో. జారీ చేయించుకుంది. ఇంకేం.. కార్పోరేట్ కంపెనీతో ప్రభుత్వం, అధికారులు సైతం కుమ్మకయ్యారు. చక చకా ఫైళ్ళు కదిలాయి. 16-1- 2014 నుండి 15-1- 2016 వరకు ప్రేక్టింగ్ లైసెన్సును కర్నూల్ మైనింగ్ అధికారులు ఇచ్చారు. సబ్ రిజిస్టార్ , ఎమ్మార్వోలు, విఏఓ లు సర్వేయర్లు అందరూ కలసి రైతుల భూముల్ని అందునా పట్టా భూముల్ని వారికి తెలియకుండానే రిలయన్స్ కంపెనీకి అప్పజెప్పారు. అయితే రైతులు, రైతు సంఘాలు హై కోర్టును ఆశ్రయించడంతో 11-11-2013 న 137 జీ.వో. ను ప్రభుత్వం జారీ చేస్తూ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ మాత్రమే రద్దయిందని లైసెన్సు మాత్రం అలాగే ఉందని రిలయన్స్ సంస్థ రైతుల భూములపై తన కబ్జా పాదాల్ని మోపేందుకు ప్రయత్నించింది.
రైతులపై వేధింపులు...
అసలే కార్పోరేట్ కంపెనీ, పైగా ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయి.. ఇంకేముంది రైతులపై రెచ్చిపోయింది. వారిని వేధించడం మొదలు పెట్టింది. దీంతో.. రిలయన్స్ కంపెనీ పెట్టే వేధింపులు తట్టుకోలేక బాధితులు హై-కోర్టును ఆశ్రయించారు. 250 మంది ఒకేసారి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రైతులకు ద్రోహం చేసిన నేతలు...
రాజుల కాలంలోనూ రైతుల భూముల్ని ఎవరూ లాక్కోలేదు. కేవలం కప్పం వసూలు చేసేవారు. కానీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిలువెల్లా స్వార్ధం నిండిన పార్టీలు, గర్వం నెత్తికెక్కిన అధినాయకులు, బడా కంపెనీలకు దాసోహమంటూ రైతులకు , పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కనుసన్నల్లో నడుచుకుంటూ జీ.వో. లను, చట్టాలను కూడా మారుస్తున్నారు. ఇక్కడ పొలాలతో పాటు 30 గ్రామాలకు తాగు నీరు అందించే చెరువును కూడా రిలయన్స్ కంపెనీ ఆక్రమించింది. 250 మంది రైతులు హై కోర్టుకి వెళితే కేవలం 60 మందికి మాత్రమే స్టే ఇవ్వడం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై 4 గ్రామాల్లోని రైతులు ఉద్యమించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్య పరిష్కరించకపొతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు, రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
source: 10tv
http://www.10tv.in/specials/bakasura/Reliance-grabbed-5-Acres-Land-in-Kurnool-37881
Post a Comment