నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం

0 comments


హైదరాబాద్ : సినీ వినీలాకాశంలో 72 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగొందిన నిండు చందురుడు నేలరాలాడు. తెలుగు సినీమతల్లికి భరించలేని గుండెకోతను మిగిల్చాడు. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (90) ఇక లేరు. మంగళవారం అర్ధరాత్రి దాటాక, బుధవారం తెల్లవారుజాము 2.45 గంటలకు హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
 
 కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అక్కినేని తెల్లవారుజాము 1.30కు తీవ్ర అస్వస్థతతో గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలావరకు విషమించింది. వైద్యులు గంటకు పైగా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో కుమారుడు, సినీ నటుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా ఆయనతోనే ఉన్నారు. అక్కినేని తన సుదీర్ఘ నట జీవితంలో 256 సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే నుంచి పద్మవిభూషణ్ దాకా పలు అవార్డులు అందుకున్నారు. తాను కేన్సర్ బారిన పడినట్లుగా గత ఏడాది అక్టోబర్ 19న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు అక్కినేని.
 
  సినీ జీవితంలో కానీ, నిజ జీవితంలో కానీ ఆయన అందకున్న ఎన్నో రికార్డుల మాదిరిగానే ఆ ప్రెస్‌మీట్ కూడా ఓ రికార్డ్. తనకు కేన్సర్ సోకినట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రముఖుడు దేశ చరిత్రలో ఎవరూ లేరు. ఆయన కేన్సర్‌ని జయించాలని, నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని తెలుగు నేల ఆశించింది, ఆశీర్వదించింది. కానీ ‘ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకము’ అన్నట్లుగా ఆ క్షణం రానే వచ్చింది. ఆత్మబలంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నిలబడ్డ 90 ఏళ్ల అక్కినేనిని మృత్యువు తన ఒడిలోకి తీసుకుంది. అయితే అక్కినేని ఆత్మస్థైర్యాన్ని చూసి విధి సైతం తల వంచాల్సిందే. ఆ మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం అందరికీ స్పూర్తిదాయకమే. ఆ స్ఫూర్తిలో అక్కినేని ఆచంద్రతారార్కమూ బతికే ఉంటారు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన అక్కినేని జీవితం భావితరాలకు ఓ పాఠ్యాంశం.
 Source:Sakshi News
Share this article :

Post a Comment

 
Support Us : Fuzail | Pradeep |SHABAAZ SHAIKZ
Copyright © 2013. mycity kurnool - All Rights Reserved