ముహూర్తం మార్పు?

0 comments

  • తెలంగాణ బిల్లు, నివేదిక ఖరారు.. మేడం ఓకే అన్నాకే కేబినెట్‌కు!
  •   నేడు కోర్‌కమిటీ ముందుకు బిల్లు, నివేదిక
  •   తూతూ మంత్రంగా ముగిసిన జీవోఎం భేటీ
  •   27న మరో సమావేశం.. చిదంబరం, ఆజాద్ లేనందుకేనన్న షిండే
  •   జీవోఎం నివేదిక ‘గోవిందా....గోవిందా’  
  •  అని నవ్వుతూ వెళ్లిపోయిన జైరాం
  •   వారి వ్యాఖ్యల లోగుట్టుపై సర్వత్రా చర్చ
  •   ప్రధాని లేక కేబినెట్ భేటీ వాయిదా 
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ బిల్లును, జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టేందుకు ముందుగా అనుకున్న ముహూర్తం కాస్తా తాజాగా మారిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం పొందాకే బిల్లును, నివేదికను కేబినెట్ ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి పంపి అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం కోసం ప్రయత్నించనున్నారు. గురువారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జైపూర్ పర్యటన కారణంగా వాయిదా పడింది. ఈ నెల 28న తిరిగి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నందున ఆ రోజైనా తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదికలను ప్రవేశపెడతారా, లేక మరికొంత కాలం వాయిదా వేస్తారా అనే దానిపై జీవోఎం సభ్యులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం వల్లే ప్రస్తుతానికి వాయిదా మంత్రం పఠించాలన్న నిర్ణయానికి వచ్చారని, 28న కేబినెట్ భేటీ ఉన్నందున అందుకు సరిగ్గా ఒకరోజు ముందు 27న జీవోఎం సభ్యులంతా సమావేశమై విభజన బిల్లును, నివేదికను ఆమోదిస్తారని ప్రచారం జరుగుతోంది.
 
 పట్టుమని పది నిమిషాలు
 మరోవైపు గురువారం జరిగిన జీవోఎం భేటీ తూతూ మంత్రంగా ముగిసింది. ఉదయం 11.30 గంటలకు నార్త్‌బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పదంటే పది నిమిషాలే గడిపి వెళ్లారు. ఈ సందర్భంగా జీవోఎం నివేదిక అంశాన్ని విలేకరులు ప్రస్తావించినా,‘షిండే మాట్లాడతారు’అని మంత్రులంతా ముక్తసరిగా బదులిస్తూ వెళ్లిపోయారు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన జైరాం కూడా అదే మాట చెప్పారు. ఇంతకూ జీవోఎం నివేదిక ఖరారైందా, మళ్లీ సమావేశాలేమైనా ఉంటాయా, లేక ఇదే చివరిదా అని విలేకరులు రెట్టించి అడగడంతో, ‘జీవోఎం రిపోర్టా.. గోవిందా.. గోవిందా...!’ అని బదులిస్తూ, విలేకరులకు ఓ నమస్కారం పెడుతూ వెళ్లిపోయారు. దాంతో ఆయన మాటలు, హావభావాలే సర్వత్రా చర్చనీయంగా మారాయి. వాస్తవానికి గురువారం నాటి జీవోఎం భేటీకి సభ్యులంతా హాజరై, నివేదికను ఆమోదించి కేబినెట్‌కు పంపుతామని బుధవారం జైరామే మీడియాకు చెప్పడం తెలిసిందే. అలాంటిది ఆయనిలా నిర్వేదం వ్యక్తం చేయడం వెనక మతలబేమిటన్నది ఆసక్తికరంగా మారింది. జైరాం వెళ్లిన 20 నిమిషాలకు బయటకొచ్చిన షిండే నేరుగా విలేకరుల వద్దకు వస్తూ, ‘మీటింగ్ అయిపోయింది. చిదంబరం, ఆజాద్ ఈ రోజు సమావేశానికి రాలేదు. అందుకే భేటీని వచ్చే వారానికి వాయిదా వేశాం. విదేశాల నుంచి చిదంబరం ఎప్పుడొస్తారో తెలుసుకుని సమావేశ తేదీని ఖరారు చేస్తాం. సాధ్యమైనంత తొందర్లో నివేదికను ఖరారు చేస్తాం’’ అని బదులిచ్చారు. ఆపై విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. షిండే వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కేంద్ర మంత్రి విదేశీ పర్యటన ఎంతో ముందుగానే ఖరారవుతుంది. చిదంబరం విదేశాలకు వెళ్తున్నట్టు షిండేకు తెలియకపోయే ఆస్కారముండదు. అయినా ఆ విషయం గురువారం నాటి భేటీ దాకా తెలియదన్నట్టుగా షిండే వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 అంతా వ్యూహాత్మకమే!
 కాంగ్రెస్ వర్గాలు మాత్రం తాము అడుగడుగునా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నామని చెబుతున్నాయి. అంతా సోనియా ఆదేశాల మేరకే జరుగుతోందని పేర్కొన్నాయి. అయితే విభజన నిర్ణయం అమలుపై కాంగ్రెస్ గట్టిగా ఉన్నా ఆ మేరకు రాజకీయ లబ్ధి మాత్రం కలగడం లేదని వాపోతున్నాయి. దీనికి తోడు సీమాంధ్రలో పార్టీ బలోపేతానికి తాము వేసిన ఎత్తులు ఫలవంతం కాకపోవడంవల్లే విభజన బిల్లు, జీవోఎం నివేదికలను జాప్యం చేయాల్సి వస్తోందంటున్నాయి. తెలంగాణ నిర్ణయం తీసుకున్నాక కూడా ఆ ప్రాంతంలో పార్టీ ఆశించిన స్థాయిలో బలపడకపోవడం ఏఐసీసీ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోందని చెబుతున్నాయి. ఇక తెలంగాణ  ఏర్పాటు కొత్త సవాళ్లకు దారి తీస్తుందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చేసిన వ్యాఖ్యల వెనుక కూడా కాంగ్రెస్ ఎత్తుగడలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సొంత పార్టీతో పాటు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, మరెన్ని ఇబ్బందులు పెట్టినా పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా విభజన బిల్లును సోనియా పట్టుదలగా ముందుకు తీసుకెళ్తున్నారనే భావన కలిగించి, రాబోయే ఎన్నికల్లో లబ్ధ్ది పొందేందుకే విషయాన్ని కొద్దిగా జాప్యం చేస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా కొత్త ఏడాది ఆరంభంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కేంద్రం ఎంత గట్టిగా చెబుతున్నా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే పరిస్థితి కన్పించడం లేదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి విభజన బిల్లును ఆమోదింపజేసుకుని తెలంగాణ ప్రజలందరినీ తమవైపు ఆకర్షించుకోవాలనే ఎత్తుగడలో ఉన్నట్టు చెబుతున్నాయి!
 
 నార్త్ బ్లాక్‌లో కావూరి, జేడీ శీలం
 విభజన నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై రూపొందించిన 10 పేజీల నివేదికను కేబినెట్ భేటీలో ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నార్త్ బ్లాక్‌కు వచ్చి జీవోఎం సభ్యులను కలిశారు. గంటపాటు జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు. జీవోఎం నివేదికను ఈ వారం కేబినెట్‌లో ప్రవేశపెట్టడం లేదని తెలుసుకుని.. నార్త్ బ్లాక్ వెనక నుంచి మీడియా కంటబడకుండా వెళ్లిపోయారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయకుంటే రాజీనామా చేస్తామని మంత్రులు హెచ్చరించారని వారి సన్నిహితులు చెబుతున్నారు. వారి ప్రత్యర్థులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. యూటీ ప్రతిపాదనను జీవోఎం సభ్యులు తిరస్కరించడమే గాక మంత్రులను ఏ మాత్రమూ పట్టించుకోలేదని, అందుకే మీడియాకు ఏం చెప్పాలో తెలియక వెనుక గేటు గుండా వెళ్లిపోయారని అంటున్నారు!
source: Sakshi
Share this article :

Post a Comment

 
Support Us : Fuzail | Pradeep |SHABAAZ SHAIKZ
Copyright © 2013. mycity kurnool - All Rights Reserved